హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగశాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండగా.. ఇప్పుడు అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూకే, అమెరికా పర్యటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం క్రితమే కేంద్రాన్ని అనుమతి కోరింది. అయితే కేంద్ర విదేశాంగశాఖ యూకే పర్యటనకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.
అమెరికా పర్యటనకు క్లియరెన్స్ ఎందుకు ఇవ్వలేదనే దానిపై కేంద్రం నుంచి స్పష్టమైన కారణం వెల్లడికాలేదు. రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని విదేశాంగశాఖ తెలిపినట్లు సమాచారం. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రాన్ని మరింత స్పష్టత కోరుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటనలో హార్వర్డ్, MIT, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రపంచస్థాయి విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకురావడమే పర్యటన ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
అయితే సీఎం స్వయంగా అమెరికా వెళ్లలేకపోతున్న నేపథ్యంలో.. తన ప్రతినిధి బృందంతో పర్యటన కొనసాగించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రతిపాదించిన ఎంవోయూలను యథాతథంగా పూర్తి చేయాలని, యూనివర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ కోణంలో తన విదేశీ పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.
కేంద్ర నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం, తెలంగాణకు అత్యుత్తమ విద్యాసంస్థలను తీసుకురావడం, ప్రపంచస్థాయి సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం తన పర్యటన లక్ష్యాలని సీఎం తెలిపారు. తన విదేశీ పర్యటన దేశ నిర్మాణానికి, వికసిత్ భారత్ లక్ష్యానికి దోహదపడుతుందని భావించినట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 21న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించనున్నారు. అనంతరం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఆగస్టు 22న కేంబ్రిడ్జ్ ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం.. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెనేట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించనున్నారు. ఆగస్టు 23న లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనపై తెలంగాణలో రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి లండన్ పర్యటనను బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్ మండిపడ్డారు. యూనివర్సిటీలను సందర్శించి అక్కడి విద్యా ప్రమాణాలను పరిశీలించడం కూడా రాజకీయంగా కనిపించడం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. మొత్తంగా.. కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్ మారింది. అయితే అమెరికా పర్యటన ద్వారా సాధించాలనుకున్న విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఎంవోయూలను తన ప్రతినిధి బృందం ద్వారా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.


