తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌లోని కోకాపేటలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి చెందిన విల్లాలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా ప్రస్తావనకు వచ్చిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి, దస్తగిరికి సంబంధించిన నివాసాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలు, నగదు చెల్లింపులపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారని, ముఖ్యంగా హవాలా మార్గంలో నగదు బదిలీలు జరిగాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన నివాసాలు, ఇతర కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తులు, నగదు చెల్లింపుల మార్గాలు, వాటికి సంబంధించిన ఆధారాలను గుర్తించే దిశగా ఈడీ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.


