తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీతో రాజకీయంగా ముందుకెళ్తున్న కల్వకుంట్ల కవిత.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి బలమైన కేడర్‌ను తయారు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘సామాజిక న్యాయ తెలంగాణ’ ఎజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేలా వ్యూహం రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. కవిత ఇప్పటి నుంచే ప్రజా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కుల సంఘాలు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువతతో వరుసగా సమావేశాలు నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రశ్నించేలా కార్యాచరణ కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదన్న అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. సమాజంలో అత్యధిక జనాభా ఉన్న వర్గాలు ఇప్పటికీ అట్టడుగునే ఎందుకు ఉన్నాయనే అంశంపై ప్రజల్లో చర్చ జరగాలని పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘సామాజిక న్యాయ తెలంగాణ’ సాధనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జిల్లా స్థాయి సభలు నిర్వహించేందుకు కవిత రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సభల్లో కవిత స్వయంగా పాల్గొని ప్రసంగించనున్నారు. పట్టణాలకే పరిమితం కాకుండా.. ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలోని ముఖ్యమైన గ్రామ పంచాయతీల్లోనూ సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోరుట్లలో సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం తొలి సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
మొదటి దశలో మండల కేంద్రాలు, ముఖ్యమైన గ్రామ పంచాయతీల్లో ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలు’ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. రెండో దశలో ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి కేడర్‌ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భౌగోళిక తెలంగాణ సాధించినట్లే.. సబ్బండ వర్గాల అభివృద్ధి, సాధికారతతో కూడిన తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కవిత భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభల నిర్వహణతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతానికి సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ నాయకుడిని బాధ్యుడిగా నియమించి.. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి కేడర్‌ను సమీకరించే బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేందుకు త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగ సభలతో పాటు మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, విశ్రాంత అధికారులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో కవిత ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులు, సామాజిక వర్గాల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన తర్వాత కవిత తొలిసారి తన సొంత జిల్లా నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 31న నిజామాబాద్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సుమారు 15 వేల మందితో సభ నిర్వహించి తన రాజకీయ బలాన్ని చాటుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టరేట్ భవనం సమీపంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల సభలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశాలు పూర్తయిన తర్వాత.. మొత్తం కార్యక్రమాలకు ముగింపుగా కామారెడ్డిలో భారీ సభ నిర్వహించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని కవిత భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మొత్తంగా ‘సామాజిక న్యాయ తెలంగాణ’ నినాదంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కేడర్‌ను సమీకరించడం, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

