టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగ రేసుకు ఎప్పటిలాగే ఈసారి కూడా భారీ సినిమాలు సిద్ధమవుతున్నాయి. షూటింగ్ పూర్తికాకముందే విడుదల తేదీలను ప్రకటించే ట్రెండ్ కొనసాగుతుండగా.. ఇప్పుడు మెగా కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు కేవలం ఒక్క రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తిని పెంచుతోంది.
సాయి దుర్గా తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా సంబరాల ఏటిగట్టును సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ‘హనుమాన్’ నిర్మాతలు కే. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ శ్రీకాంత్ కీలకమైన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
అయితే ‘సంబరాల ఏటిగట్టు’ విడుదల తేదీ ప్రకటించిన కొద్ది రోజులకే మరో కీలక ప్రకటన వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం జనవరి 13న థియేటర్లలోకి రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. దీంతో మేనల్లుడు సాయి దుర్గా తేజ్ సినిమా, మామయ్య చిరంజీవి సినిమా వరుసగా రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు సంక్రాంతి సీజన్‌లో ఇలా పోటీ పడటం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా థియేటర్ల కేటాయింపు, స్క్రీన్ల సంఖ్య, తొలి వారాంతపు కలెక్షన్లపై ఈ పోటీ ప్రభావం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే పలు కారణాలతో ఆలస్యమైన ‘సంబరాల ఏటిగట్టు’ను మేకర్స్ జనవరి 12న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే చిరంజీవి సినిమా మరుసటి రోజే ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సాయి దుర్గా తేజ్ తన సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేస్తారా? లేక మరోసారి వాయిదా వేసుకుంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తనకు ఎంతో ఆప్తుడైన మేనమామ చిరంజీవి సినిమాతో నేరుగా పోటీ పడే పరిస్థితిని సాయి దుర్గా తేజ్ ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండటంతో సంక్రాంతి బాక్సాఫీస్ పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే విడుదల తేదీపై ‘సంబరాల ఏటిగట్టు’ టీమ్ నుంచి తదుపరి అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.


