ఆంధ్రప్రదేశ్ : కాకినాడలోని ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న సీఎం.. సమస్యను తక్షణమే పరిష్కరించి, విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగారు. విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విద్యార్థినుల వసతి గృహాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు ఫిర్యాదు చేస్తే పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిబంధనల ప్రకారం వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అవసరమైన వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు భద్రత కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. అధికారుల చొరవతో పరిస్థితి అదుపులోకి వచ్చి సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది. అధికార యంత్రాంగం స్పందించిన తీరుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినుల మధ్య వివాదానికి ఓ ఫోన్ కారణమైనట్లు తెలుస్తోంది. తన మొబైల్ ఫోన్ కనిపించడం లేదంటూ మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని ఇటీవల సర్పవరం పోలీసులను ఆశ్రయించింది. తర్వాత ఫోన్ లభించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. దీంతో ఏపీ, మణిపూర్‌కు చెందిన విద్యార్థినులు పరస్పరం ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో విద్యార్థినుల్లో భద్రతపై భరోసా ఏర్పడింది.


