పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.
దోర్నాల మండలం గంటావానిపల్లి, కొత్తూరు ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు, సంబంధిత ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌తో పాటు వెలిగొండ ప్రాజెక్టు, ఫీడర్ కెనాల్ పనులను అధికారులు పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన రెండు టన్నెళ్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి. టన్నెల్-2లో ప్రస్తుతం సుమారు 100 మీటర్ల మేర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల 25 నాటికి ఇంజినీరింగ్ పనులన్నింటినీ పూర్తి చేసి అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో టన్నెల్ పనుల్లో వినియోగిస్తున్న టీబీఎం మెషిన్‌కు సంబంధించిన మరో 100 టన్నుల విడిభాగాలను తరలించాల్సి ఉందని అధికారులు వివరించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

