Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా ఆమె నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను వెనక్కి నెట్టి రష్మిక ఈ ఘనత సాధించారు. దీంతో ఆమెను ‘న్యూ నేషనల్ స్టార్’గా అభివర్ణిస్తూ సినీ వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో రష్మిక మందన్న అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా తొలి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో దీపికా పదుకొణె రెండో స్థానంలో ఉండగా.. శ్రద్ధా కపూర్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి నాలుగో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ నటి ఆలియా భట్ ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
రష్మిక మందన్నకు ఈ అరుదైన గుర్తింపు దక్కడంపై ఆమె భర్త, హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సంతోషం వ్యక్తం చేశారు. సర్వేకు సంబంధించిన మ్యాగజైన్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయ్.. రష్మిక సాధించిన విజయంపై గర్వంగా ఉందంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. రష్మిక నంబర్ వన్ స్థానానికి చేరుకోవడంపై అభిమానులు కూడా సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. దక్షిణాది సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకోవడం విశేషం.

రష్మిక మందన్న కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగారు. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా ఫిమేల్ సెంట్రిక్ కథలను కూడా ఎంచుకుంటూ తన నటనా సామర్థ్యాన్ని చాటుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు.
గత కొంతకాలంగా రష్మిక నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ‘పుష్ప 2’, ‘యానిమల్’, ‘ఛావా’, ‘కుబేర’ వంటి చిత్రాలతో ఆమెకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ అనే పీరియడ్ హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. అదే సమయంలో ‘మైసా’ అనే పాన్ ఇండియా ఫిమేల్ సెంట్రిక్ చిత్రంలోనూ రష్మిక నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
రష్మికకు ‘నేషనల్ క్రష్’ అనే గుర్తింపు ఇప్పటికే ఉండగా.. తాజాగా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడంతో ‘న్యూ నేషనల్ స్టార్’ అనే ట్యాగ్ కూడా ఆమెకు జతైంది. ఈ అరుదైన ఘనతతో రష్మిక అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

