Kerala Accident: కేరళలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా పోలీసులు వెల్లడించారు.
తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో కేరళ పర్యటనకు వెళ్లారు. గురువాయూర్ సందర్శన అనంతరం కొడుంగలూర్ వైపు తిరిగి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో త్రిస్సూర్ జిల్లాలోని కైపమంగలం వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైవేపై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమించారు. అనంతరం ఎనిమిది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, కారు లారీని ఢీకొట్టడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మృతులను తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న పీఎస్ఎన్ఏ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. కాలేజీ ఐడీ కార్డుల ఆధారంగా సేలం జిల్లాకు చెందిన విశ్వ (20), దిండిగల్‌కు చెందిన సూర్య(20), మధురైకి చెందిన సంతోష్ (20), ప్రసన్న, దిండిగల్‌కు చెందిన యువసంజిత్(20)గా గుర్తించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.


