Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. 2029లోగా రాష్ట్రంలో మరో మూడు డీఎస్సీలు(DSC) నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి పాల్గొన్న లోకేశ్.. విద్యాశాఖకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు.
తమ ప్రభుత్వం ఏటా డీఎస్సీ నిర్వహించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సీఎం చంద్రబాబు 14 డీఎస్సీలు నిర్వహించారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలో సుమారు 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ‘‘కాయలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు’’ అంటూ వ్యాఖ్యానించారు.
విద్యా వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేయించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని, విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తే వారు అద్భుతాలు సాధించగలరని లోకేశ్ అన్నారు. రాష్ట్ర విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.


