Konda Sushmitha: కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోవడంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత భావోద్వేగానికి గురయ్యారు. తన వ్యాఖ్యల కారణంగా తల్లికి ఈ పరిస్థితి రావడం బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతగా కక్ష పెంచుకుంటారని ఊహించలేదన్నారు. తన తల్లి నిర్వహించిన శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదని, తాను గతంలో చేసిన వ్యాఖ్యల్లోనూ తప్పేమీ లేదని సుస్మిత స్పష్టం చేశారు.
తన మాటల కారణంగా తల్లిని అవమానించే పరిస్థితి వస్తుందని ముందే తెలిసి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసేదాన్ని కాదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే తమ తల్లిదండ్రులు రాజకీయంగా ఎదిగారని, అలాంటి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని వాపోయారు. పార్టీ నుంచి వెళ్లిపోతాననే స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి దిగజారి వ్యవహరిస్తారని భావించలేదని ఆమె ఆరోపించారు.
ఇటీవల పరకాల నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. పరకాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డినే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


