Telangana Assembly: తెలంగాణ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో భద్రత, ఇతర ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ, పోలీస్, ఇంటెలిజెన్స్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నందున శాంతిభద్రతలకు, భద్రతా ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. అసెంబ్లీ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాలు సమన్వయంతో పటిష్ట భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు.సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. ముఖ్య అధికారులను అసెంబ్లీ ప్రాంగణంలో అందుబాటులో ఉంచుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
ఈ సమావేశాల్లో 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, 22ఏ భూములు, ఆస్తిపన్ను, హైడ్రా, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 ఏళ్లుగా ఉంది. ఈ నిబంధనలో మార్పు కోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే అది కేంద్రానికి సిఫార్సుగా వెళ్లనుంది.


