YS Sharmila: వైఎస్ షర్మిల ఇంట మరోసారి పెళ్లి సందడి మొదలుకానుంది. ఆమె కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం త్వరలో జరగనుంది. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాబోయే అల్లుడు డాక్టర్ రఘురామరెడ్డితో కలిసి ఉన్న అంజలి ఫొటోను షేర్ చేస్తూ, ఈ శుభవార్తను అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
కర్నూలు జిల్లాకు చెందిన సోమల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడైన డాక్టర్ రఘురామరెడ్డితో అంజలి వివాహం నిశ్చయమైందని పేర్కొన్నారు. సోమల కుటుంబం ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిందని.. ఇరు కుటుంబాలు అమెరికాలోనే నివసిస్తున్నట్లు షర్మిల వెల్లడించారు. తమ కుమార్తె వివాహం నిశ్చయమైనందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. కుటుంబానికి అందరి ప్రార్థనలు, ఆశీస్సులు కావాలని ఆమె కోరారు.
https://x.com/realyssharmila/status/2096484306604732754?
అంజలి రెడ్డి అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం అక్కడే ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్నారు. మరోవైపు కాబోయే వరుడు రఘురామరెడ్డి అమెరికాలో వైద్య విద్యను అభ్యసించి, ప్రస్తుతం నాష్‌విల్‌లో డాక్టర్‌గా సేవలందిస్తున్నట్లు సమాచారం. షర్మిలకు అంజలితో పాటు కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జోధ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ఇప్పుడు అంజలి వివాహం ఖరారు కావడంతో షర్మిల కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి నెలకొంది.

