అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్వాడీల విభాగం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి శాసన మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషేను రాజు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన వారిని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎమ్మెల్సీలుగా నియమించడంతో దళవాయి రమాదేవి మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. దళవాయి రమాదేవి టీడీపీలో కింది స్థాయి నుంచి ఎదిగారు. తెలుగుదేశం పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి దళవాయి రమాదేవి కృషిచేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వ వేధింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ అనంతపురం నగరపాలక సంస్థకు 2021లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే 37 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గతంలో పార్టీ యూనిట్ ఇన్‌ఛార్జి, అంగన్వాడీ విభాగ సాధికారిక కన్వీనర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం క్లస్టర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రమాదేవి భర్త వెంకటనారాయణ 25 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.


