తిరుపతిలో మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి భూ ఆక్రమణ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి ఈరోజు తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
తనపల్లి ప్రాంతంలో భూ ఆక్రమణకు పాల్పడి, ఆ భూమిలో అక్రమంగా రోడ్లు నిర్మించారనే ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూమిని కబ్జా చేశారంటూ బాధితుడు వెంకట ప్రసాద్ ఫిర్యాదు చేయడంతో భూమన కరుణాకర్‌రెడ్డి, ఇతరులపై కేసు నమోదైంది.
ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగుతుండగా… పోలీసుల ఎదుట భూమన కరుణాకర్‌రెడ్డి, అభినయ్‌రెడ్డి తమ వాదనలు వినిపించినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


