జనసేన శాసన సభాపక్ష సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై లోతుగా చర్చించినట్లు ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సమావేశ వివరాలను ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా పోటీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు వెళ్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల ఉత్సాహాన్ని మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జనసేన శాసనసభాపక్ష సమావేశంలో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు పవన్ వెల్లడించారు. జనసైనికుల పోరాట స్ఫూర్తికి అనుగుణంగా ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మద్దతు పొందేలా ముందుకు సాగుతామని చెప్పారు.

