ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎక్కడా తప్పులు జరగకుండా వ్యవస్థలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాజకీయ నాయకులకు విశ్వసనీయతతో పాటు సమాజం పట్ల బాధ్యత ఉండాలని సీఎం అన్నారు. వ్యవస్థలను సర్వనాశనం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో గ్రూప్-1 వ్యవహారం ఓ కేస్ స్టడీగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
గతంలో తప్పులు చేసిన నాయకులు, అధికారులు జైలుకు వెళ్లారని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ అధినేత చెప్పిన పనులు చేసి కొందరు అధికారులు జైళ్లకు వెళ్లారని ఆరోపించారు. గ్రూప్-1 విషయంలో కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారని, ప్రభుత్వ కార్యదర్శితో తప్పుడు అఫిడవిట్లు వేయించారని విమర్శించారు. హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసినా తప్పుడు అఫిడవిట్లు కొనసాగించారని పేర్కొన్నారు.
యువత జీవితాలతో ఆటలాడటం దారుణమని చంద్రబాబు అన్నారు. అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. గ్రూప్-1లో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమాలు చేసేవారికి ప్రజా చైతన్యమే సరైన మందు అన్నారు.
ప్రతిభావంతుల సత్తాను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువత ఉన్నారని, ఏఐ పరిజ్ఞానంతో అనేక అద్భుతాలు చేస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని, తప్పు చేయాలంటే భయపడేలా మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఏపీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి, పరీక్షలన్నీ పారదర్శకంగా నిర్వహించేలా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.

