తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలను సందర్శించడంతో పాటు వివిధ సమావేశాల్లో పాల్గొననున్నారు.
రేపు ఉదయం 10 గంటలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు EPL ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమం కోసం ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించనున్నారు. ఆగస్టు 22న ఉదయం కేంబ్రిడ్జ్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అనంతరం లండన్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్‌కు సీఎం రేవంత్ వెళతారు.
యూకే పర్యటన అనంతరం ఆగస్టు 23న సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి అమెరికాలోని బాస్టన్‌కు విమానంలో ప్రయాణించనున్నారు. అక్కడ కూడా పలు ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 24న హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు MIT క్యాంపస్‌ను సందర్శిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు బాస్టన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరనున్నారు.
ఆగస్టు 25న నోర్త్-ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సీఎం సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందంతో సమావేశం కానున్నారు. ఆగస్టు 26న న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, వివిధ వర్గాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.
అమెరికా పర్యటన ముగించుకుని ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆగస్టు 30న హైదరాబాద్ చేరుకోనున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో యూకే, అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు పలు ప్రతినిధి బృందాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ పర్యటన ద్వారా విద్య, పరిశ్రమలు, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు సంబంధించిన అంశాలపై చర్చలకు అవకాశం ఉండనుంది.


