శ్రావణ మాసం శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలిరావడంతో పలు ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కూరగాయలు, కరెన్సీ నోట్లు, పసుపు కొమ్ములు తదితరాలతో అమ్మవారి అలంకరణలు చేపట్టారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. శ్రావణ మాసం ప్రత్యేకతతో పాటు వరలక్ష్మీ వ్రతం పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తుల సందడితో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.


