హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. అయితే దీనిపై ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు బాలు నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సుస్మిత వ్యాఖ్యలకు సంబంధం లేదంటే సురేఖ వాటిని బహిరంగంగా ఖండించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని బలహీనపర్చేలా కొందరు వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. పార్టీ వేదికపై మాట్లాడాల్సిన విషయాలను బహిరంగంగా ప్రస్తావించడం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కులం, హోదాతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.


