దేశంలో డిజిటల్ మోసాలు మరియు సైబర్ నేరాలను అరికట్టే దిశగా టెలికమ్యూనికేషన్స్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి పేరు మీద గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్లు మాత్రమే ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని టెలికాం సేవా ప్రదాతలకు DoT కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 9 సిమ్‌లు ఉన్న చందాదారులకు ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త కనెక్షన్లు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 24 నుండి పూర్తి స్థాయిలో అమలులోకి రానున్నాయి.
టెలికాం రంగంలో కేంద్ర ప్రభుత్వం మోసాలను అరికట్టేందుకు కొత్త రూల్స్ తీసుకువచ్చింది. రెగ్యులేటరీ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. దేశంలో ఒక వ్యక్తి తన పేరుపై గరిష్టంగా ఎన్ని సిమ్ కార్డులు కలిగి ఉండాలనే దానిపై కఠినమైన రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి పేరుపై దేశవ్యాప్తంగా అన్ని టెలికాం ఆపరేటర్లు, సర్వీస్ ఏరియాలు కలుపుకుని గరిష్టంగా 9 కనెక్షన్లు మాత్రమే ఉండటానికి అనుమతి ఉంది. అంటే జియోలో 9.. ఎయిర్‌టెల్‌లో మరో 9.. వీఐలో ఇంకో 9 అనేది కుదరదు. అన్ని కంపెనీలు కలిపి 9 మాత్రమే. ఇప్పటికే 9 కనెక్షన్లు ఉన్నవారికి కొత్త సిమ్ ఇవ్వొద్దని టెలికాం సంస్థలకు డాట్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
దేశంలో చాలా ప్రాంతాల్లో గరిష్ట పరిమితి 9 సిమ్ కార్డులు కాగా.. జమ్ము-కశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కేవలం 6 కనెక్షన్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది డాట్. కొత్త సిమ్ తీసుకునే సమయంలో కస్టమర్ అప్లికేషన్ ఫారమ్‌లో తన పేరుపై ఉన్న పాత మొబైల్ కనెక్షన్ల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే టెలికాం సంస్థలు సాంకేతిక వ్యవస్థ ద్వారా ముందుగానే వినియోగదారుడి పేరుపై ఉన్న కనెక్షన్లను తనిఖీ చేయాలి. పరిమితికి మించి సిమ్ యాక్టివేట్ అయినట్లు రోజువారీ తనిఖీల్లో తేలితే.. ఆ కనెక్షన్‌ను నిలిపివేయాలని డాట్ ఆదేశించింది. ఇందుకోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్–DIPను వినియోగించనున్నారు. ఆగస్టు 23 నాటికి 9 సిమ్‌ల పరిమితిని చేరుకున్న వినియోగదారుల వివరాలు, ఫొటోలు ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వివిధ టెలికాం కంపెనీల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ డేటాబేస్‌ను రూపొందించారు.
సిమ్ కార్డుల అక్రమ విక్రయాలు, నకిలీ గుర్తింపులతో కనెక్షన్లు తీసుకోవడం, వాటిని సైబర్ మోసాలు, ఫిషింగ్ కాల్స్, ఆర్థిక నేరాలకు ఉపయోగించడాన్ని అరికట్టడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం.. మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందేమో..? గతంలో తీసుకున్న సిమ్ ఇప్పుడు వాడటం లేదా..? అయితే నిర్లక్ష్యం చేయొద్దు. సంచార్ సాథి ద్వారా మీ పేరుపై ఉన్న నంబర్లను చెక్ చేసుకుని, అనుమానాస్పద కనెక్షన్లను వెంటనే డిస్కనెక్ట్ చేయించుకోవాలని సూచిస్తుంది.


