PM Modi: బంగారం ఎక్కువగా కొనొద్దు అంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ మళ్లీ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. మూడు నెలల క్రితం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని.. ఏడాది పాటు భారత ప్రజలు బంగారం కొనొద్దు అంటూ పిలుపునిచ్చారు. మోదీ పిలుపుతో బంగారం కొనుగోలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. తాజాగా అవసరం లేకపోతే బంగారం కొనొద్దు అంటూ మోదీ విజ్ఞప్తి చేశారు. దీని వెనక పెద్ద కారణమే ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. భారత్ తన బంగారం అవసరాల్లో దాదాపు మొత్తం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంటే మనం బంగారం కొన్న ప్రతిసారీ దేశం నుంచి విదేశీ మారకం బయటకు వెళ్తుంది. దిగుమతులు పెరిగితే వాణిజ్య లోటు పెరిగే అవకాశం ఉంటుంది. డాలర్లకు డిమాండ్ పెరిగితే రూపాయిపై కూడా ఒత్తిడి పడుతుంది.
సాధారణంగా భారతీయులకు బంగారం అంటే ఎంతో సెంటిమెంట్. అలాంటి బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని పదేపదే సూచించడం వెనుక ఆర్థికపరమైన పెద్ద కారణమే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం, ముడిచమురు, ఎరువులు, వంట నూనెల వంటి కీలక వస్తువుల కోసం భారత్ భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న అంతర్జాతీయ ధరలు, ఎగుమతులపై ఒత్తిడి, విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లలో మార్పులు వంటి అంశాలు దేశ ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి పెంచుతున్నాయి.
భారత్ తన బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల(Gold Imports ) ద్వారానే తీర్చుకుంటోంది. అంటే దేశంలో బంగారం కొనుగోళ్లు పెరిగినప్పుడల్లా దానికి చెల్లించాల్సిన డాలర్లు విదేశాలకు వెళ్తాయి. భారతీయులు సాధారణంగా ఏడాదికి సుమారు 700-900 టన్నుల బంగారం కొనుగోలు చేస్తారని అంచనా. దీని విలువ లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. దేశంలో వినియోగించే బంగారంలో 90 శాతానికి పైగా దిగుమతుల నుంచే వస్తున్న నేపథ్యంలో పసిడి డిమాండ్ పెరగడం అంటే విదేశీ మారక ద్రవ్యంపై అదనపు భారం పడటమే. ఇటీవల బంగారం ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ధర పెరగడంతో అదే స్థాయిలో బంగారం కొనుగోలు చేసినా భారత్ నుంచి బయటకు వెళ్లే డాలర్ల విలువ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బంగారం దిగుమతులకు భారత్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దీంతో దేశంలో ఉన్న విదేశీ మారక ద్రవ్యంపై(Forex Reserves) ఒత్తిడి పెరుగుతుంది.
ఇక దిగుమతుల విలువ ఎగుమతుల కంటే ఎక్కువగా ఉంటే వాణిజ్య లోటు పెరుగుతుంది. వాణిజ్య లోటు పెరిగే కొద్దీ డాలర్లకు డిమాండ్ పెరగొచ్చు. ఫలితంగా రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది.అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లను కొంతకాలం తగ్గించడం ద్వారా దేశం విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బంగారం దిగుమతుల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభమైన తొలి నాలుగు నెలల్లో బంగారం దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 32 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ప్రధాని మోదీ బంగారం కొనుగోళ్లను ప్రస్తావించినప్పటికీ.. అసలు సమస్య అంతకంటే విస్తృతమైనది. భారత్ విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేస్తున్న ప్రధాన రంగాల్లో ముడిచమురు, బంగారం, వంట నూనెలు, ఎరువులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు దేశీయంగా అవసరమైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత్ మొత్తం దిగుమతుల బిల్లు సుమారు 775 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో ముడిచమురు, బంగారం, వంట నూనెలు, ఎరువుల వంటి కీలక వస్తువులకే 240 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చవుతున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.
భారత్ ముడిచమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. పశ్చిమాసియాలో యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరిగినప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే భారత్ అదే పరిమాణంలో చమురును దిగుమతి చేసుకోవడానికి మరిన్ని డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.ఇదే పరిస్థితి ఎరువులు, ఇతర దిగుమతి వస్తువుల విషయంలోనూ ఎదురైతే దేశ దిగుమతుల బిల్లు మరింత పెరగొచ్చు.విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఒక దేశ ఆర్థిక భద్రతకు కీలకమైన సూచికల్లో ఒకటి. అవసరమైన సమయంలో దిగుమతుల కోసం చెల్లింపులు చేయడానికి, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఇవి ఉపయోగపడతాయి.దేశం వద్ద తగినంత ఫారెక్స్ రిజర్వులు ఉంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఆ దేశంపై నమ్మకం పెరుగుతుంది. రిజర్వులు వేగంగా తగ్గిపోతున్నాయని కనిపిస్తే మాత్రం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది.
బంగారం భారతీయుల జీవితంలో ఒక పెట్టుబడి మాత్రమే కాదు.. భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి. అందువల్ల పూర్తిగా బంగారం కొనకూడదని చెప్పడం ఆచరణలో సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు. కానీ అవసరం లేని వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్లను కొంత మేర నియంత్రించవచ్చు. ఇదే సమయంలో ముడిచమురు, ఎరువులు, వంట నూనెల వంటి కీలక దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎగుమతులను పెంచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి దీర్ఘకాలిక చర్యలు కూడా అవసరం.


