Irumudi: మాస్ మహారాజా రవితేజ(Raviteja) నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తోంది. విడుదలైన రోజు నుంచి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసి సత్తా చాటింది. సినిమాకు లభిస్తున్న పాజిటివ్ టాక్, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో కలెక్షన్ల జోరు కొనసాగుతోంది.
‘ఇరుముడి’ మూవీ విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్కు తోడు దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన కుటుంబ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత కూడా వసూళ్లలో తగ్గుదల కనిపించకపోవడంతో 12వ రోజుకే రూ.200 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. తమ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.‘ఇరుముడి’ మూవీని జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా అభివర్ణించారు.
https://x.com/MythriOfficial/status/2095064549389127713?s=20
రవితేజ సినిమాల్లో సాధారణంగా కనిపించే మాస్ ఎనర్జీతో పాటు కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం సినిమాకు కలిసొచ్చిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు మంచి స్పందన రావడం బాక్సాఫీస్ వసూళ్లకు ప్రధాన బలంగా మారింది. కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తుండటంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ కొనసాగుతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.
‘ఇరుముడి’ సాధిస్తున్న కలెక్షన్లతో రవితేజ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను కేవలం 12 రోజుల్లోనే అందుకోవడం సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తూ 12 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే రూ.300 కోట్ల్ క్లబ్‌లోకి చేరడం ఖాయమని మూవీ క్రిటిక్స్ అంచనావేస్తున్నారు.


