Local body elections: స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల సన్నాహకాలతో పాటు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ సన్నాహకాలపై ఇన్ఛార్జి మంత్రులు, సీనియర్ నాయకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేయనున్నారు. ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడంతో పాటు గ్రామస్థాయి నుంచి టీడీపీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు.
ప్రజాప్రతినిధుల పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సూచించారు. అయితే ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పరిస్థితులపై మరింత దృష్టి పెట్టాలని భావించిన ఆయన.. నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యేలకు రెండు రోజుల శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే తీరు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం, ప్రజలతో సమన్వయం వంటి పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనున్నారు.
ఈ శిక్షణా కార్యక్రమాలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ కూడా హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడి వారి నియోజకవర్గాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన రాజకీయ, పరిపాలనా వ్యూహాలపై కూడా సీఎం మార్గదర్శనం చేయనున్నారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపైనా మంత్రి లోకేశ్ కూడా కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని, వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అక్టోబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు దశలవారీగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ముందుగా మునిసిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకుని అన్ని స్థానాల్లోనూ ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని లోకేశ్ చెప్పారు.


