Nara Lokesh: కొత్త పింఛన్లపై మంత్రి లోకేశ్ శుభవార్త చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు అక్టోబర్ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. అమరావతిలో టీడీపీ మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. అర్హుల నుంచి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పింఛన్లలో వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. వీరు సుమారు లక్షన్నర మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నెలలోనే దరఖాస్తుల స్వీకరించనున్నారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపైనా మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని, వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అక్టోబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసి అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలు దశలవారీగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు లోకేశ్ తెలిపారు. ముందుగా మునిసిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకుని అన్ని స్థానాల్లోనూ ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడేలా వైసీపీ కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని లోకేశ్ ఆరోపించారు. ఎన్నికలు వాయిదా పడితే కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అయితే ప్రభుత్వం అన్ని చట్టపరమైన సమస్యలను అధిగమించి అనుకున్న సమయానికే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసి తీరుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.
మొత్తంగా స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ.. ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లే పనిని వేగవంతం చేస్తోంది. సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు, ఎమ్మెల్యేలకు శిక్షణ, లోకేశ్ దిశానిర్దేశంతో ఎన్నికల సన్నాహకాలు మరింత ఊపందుకోనున్నాయి.


