KONDA SUREKHA: అనుకున్నదే జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సిఫార్సు చేశారు. ఈ మేరకు లేఖను గవర్నర్‌కు సీఎస్ పంపించారు. వెంటనే సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి లేఖలో కోరారు. సీఎం లేఖపై గవర్నర్ కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు.
కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోరినట్లు సమాచారం. అయితే ఆమె రాజీనామాకు అంగీకరించకపోవడంతోనే బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎంవో నుంచి వచ్చిన లేఖను లోక్ భవన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆమోదం అనంతరం ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఈ పరిణామానికి ప్రధాన కారణంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కొండా సురేఖ కుటుంబం మధ్య నెలకొన్న విభేదాలు క్రమంగా బహిరంగ చర్చకు దారితీశాయి. ఇటీవల కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నాయకత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక కీలకంగా మారినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశాలపై కమిటీ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలించిన అనంతరం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ అధిష్ఠానానికి వివరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ బర్తరఫ్ ప్రక్రియ పూర్తయితే కొండా సురేఖ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్ఠానంతో ఆమె తాడోపేడో తేల్చుకుంటారా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ రాజకీయంగా తన వ్యూహాన్ని మార్చుకుంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి నుంచి తప్పించినా ఆమె రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం ఎలా ఉండబోతుందన్నది కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎంవో లేదా రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపైనా కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. ఆయనను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. చిన్నారెడ్డి స్థానంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమించింది.


