CM ChandraBabu: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ(Cabinet Meeting) సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు సమావేశానికి హాజరయ్యేందుకు రాగానే మంత్రులంతా గౌరవంగా లేచి నిలబడి చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రులు అభినందనలు తెలిపారు.
ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ ప్రధాన కాలువను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. వెలిగొండతో మార్కాపురం జిల్లాకు కృష్ణా జలాలు, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి నీళ్లు తీసుకురావడంపై మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు ఇచ్చిన ఈ ‘స్టాండింగ్ ఒవేషన్’ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అయితే సమావేశం ప్రారంభానికి ముందు మంత్రులు ముఖ్యమంత్రికి ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


