Konda Surekha: తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గవర్నర్ను కోరిన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తనను మంత్రివర్గం నుంచి తప్పించాలనే నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. బర్తరఫ్ నిర్ణయం తీసుకునే ముందు కనీసం తన వివరణ తీసుకోవాల్సిందని వాపోయారు. తనపై కక్షపూరితంగానే చర్యలు తీసుకున్నారని భావిస్తున్నట్లు సురేఖ వ్యాఖ్యానించారు.
తన కుమార్తె కొండా సుస్మిత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని కొండా సురేఖ అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని పేర్కొన్నారు. తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలను తప్పుబట్టే అధికారం కూడా తనకు లేదని అన్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడిన ప్రతి విషయానికి తనను బాధ్యురాలిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మంత్రి పదవికి రాజీనామా చేయాలని తనను ఎవరూ కోరలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. తనను బర్తరఫ్ చేస్తున్నట్లు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కనీసం తనతో మాట్లాడి ఉండాల్సిందని అన్నారు. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు వాటికి సమాధానం కూడా ఇచ్చానని చెప్పారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎలాంటి సంతకం లేకుండా బర్తరఫ్కు సంబంధించిన లేఖను విడుదల చేశారని ఆమె ఆరోపించారు.
తనపై చర్యలు తీసుకున్న పార్టీ నాయకత్వం.. ఇతర నేతల వ్యాఖ్యల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో చెప్పాలని కొండా సురేఖ ప్రశ్నించారు. జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను ఇచ్చిన లేఖను మీడియాకు విడుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తనపై మాత్రమే కఠిన చర్యలు తీసుకోవడం వెనుక కక్షపూరిత వైఖరి ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.
తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం సంతోషంగా ఉందని కొండా సురేఖ అన్నారు. అయితే తన కోసం చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. తన భర్తకు కనీసం ఛైర్మన్ పదవి కూడా ఇవ్వలేదనే బాధ తన కుమార్తె సుస్మితకు ఉందని చెప్పారు. తన కుమార్తె గత పదేళ్లుగా రాజకీయంగా టికెట్ కోసం ప్రయత్నిస్తోందని కొండా సురేఖ తెలిపారు. కడియం శ్రీహరి తన కుమార్తెకు ఎంపీ పదవి దక్కేలా చేసుకున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొండా సురేఖ చెప్పారు. తన భర్తతో చర్చించిన తర్వాత తదుపరి అడుగు నిర్ణయించుకుంటానని తెలిపారు. మరోవైపు బర్తరఫ్ వ్యవహారంపై కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో మరింత రాజకీయ వేడిని పెంచే అవకాశం కనిపిస్తోంది. ఆమెపై అధిష్ఠానం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కొండా సురేఖ భవిష్యత్ రాజకీయంగా ఎలాంటి అడుగు వేస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


