Intintiki Telugu Desam: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మరో రెండున్నరేళ్లలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ఇప్పటికే కోటి ఇళ్లను చేరుకున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ సందర్భంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమం కీలక మైలురాయిని చేరుకుందని లోకేష్ పేర్కొన్నారు. కోటికి పైగా ఇళ్లను సందర్శించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటి పర్యటనల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు.. ఆయా కుటుంబాల సమస్యలను కూడా టీడీపీ నేతలు తెలుసుకుంటున్నారని లోకేష్ తెలిపారు.

కేవలం ఇళ్లను సందర్శించడానికే పరిమితం కాకుండా.. కుటుంబాల స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను కార్యకర్తలు సేకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నాయి.ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలను గుర్తించడంతో పాటు.. పథకాల ప్రయోజనాలు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశంపైనా కార్యకర్తలు ఆరా తీస్తున్నట్లు టీడీపీ తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు.. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే సమస్యలు, సూచనలను తెలుసుకునే అవకాశం లభిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కోటి ఇళ్ల మైలురాయిని చేరుకోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.


