Mithali Raj: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) నిర్వహించనున్న ఉమెన్స్ ఏపీఎల్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ఉమెన్ ఏపీఎల్(Womens APL) షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. టోర్నీలో ఫైనల్‌తో కలిపి మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఉమెన్ ఏపీఎల్‌లోని అన్ని మ్యాచ్‌లకు మంగళగిరి వేదిక కానుంది. ప్రేక్షకులకు మంచి క్రికెట్ అనుభూతిని అందించేలా డే, నైట్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఏసీఏ ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు.. ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులను వెలుగులోకి తీసుకురావడమే ఉమెన్ ఏపీఎల్ ప్రధాన ఉద్దేశంగా ఏసీఏ పేర్కొంది.
ఇక టీమిండియా దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ను(Mithali Raj) ఉమెన్ ఏపీఎల్‌కు అంబాసిడర్‌గా నియమించారు. ఆమె భాగస్వామ్యంతో టోర్నీకి మరింత గుర్తింపు లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళా క్రికెట్ అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి మాజీ భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా విశాఖ క్రికెట్ స్టేడియంలో మిథాలీ రాజ్ పేరుతో ఓ స్టాండ్ కూడా ఏర్పాటు చేసి గౌరవించింది. తాజాగా ఉమెన్స్ ఏపీఎల్ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
ఇక 23 ఏళ్ల పాటు సాగిన మిథాలీ రాజ్ క్రికెట్ కెరీర్ అద్భుతంగా సాగింది. ఆమె 232 వన్డేలలో 50.68 సగటుతో ఏడు సెంచరీలతో సహా 7,805 పరుగులు చేసి 2022లో రిటైర్ అయ్యారు. అంతేకాకుండా 89 టీ20లలో 17 అర్ధ సెంచరీలతో 2,364 పరుగులు, 12 టెస్టుల్లో 43.68 సగటుతో 699 పరుగులు సాధించారు. అత్యున్నత స్థాయిలో రాజ్ కనబరిచిన నిలకడ, సుదీర్ఘ కెరీర్ ఆమెను భారతదేశవ్యాప్తంగా వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శంగా నిలిపాయి.
మరోవైపు ఉమెన్స్ ఏపీఎల్ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ఏసీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్‌ల నిర్వహణ, ఆటగాళ్ల సౌకర్యాలు, ప్రేక్షకులకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. ఈ టోర్నీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం లభిస్తుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.


