PM Modi: ఉపాధ్యాయ దినోత్సవాన్ని(Teachers Day) పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న టీచర్లు, విద్యావేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువుతో పాటు వారి దైనందిన జీవితం, అలవాట్లపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ప్రస్తుతం పిల్లల్లో స్క్రీన్ టైమ్, మొబైల్ ఫోన్ వినియోగం వ్యసనంగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. వారిని ఫోన్‌లకు దూరంగా ఉంచేందుకు మైదానంలో ఆడే క్రీడలపై ఆసక్తి పెంచాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలపై పిల్లల్లో ఆసక్తిని పెంపొందించాలని చెప్పారు.
అలాగే పిల్లల్లో మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లు పెరగకుండా ఉపాధ్యాయులు నిరంతరం వారి ప్రవర్తనను గమనించాలని మోదీ సూచించారు. పాఠ్యపుస్తకాలు, సిలబస్‌కే పరిమితం కాకుండా విద్యార్థులకు నిజ జీవిత నైపుణ్యాలు, నైతిక విలువలు, సమాజ పరిస్థితులపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించడం ఉపాధ్యాయుల బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఎంపికయ్యారు.


