CM Chandrababu: వరుసగా సాగు నీటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై నేషనల్ మీడియా ప్రశంసలు కురిపించింది. సీఈవో సీఎం నుంచి వాటర్ మ్యాన్ సీఎంగా చంద్రబాబు జర్నీ మారిందని కొనియాడింది. ‘ఎకనామిక్ టైమ్స్’లో వచ్చిన కథనంపై చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
‘సీఈవో సీఎం’గా కంటే ప్రజలకు నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలని ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. తన వారసత్వం నీటి ప్రవాహంలో కనిపించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ, వెలిగొండ ప్రాజెక్టులు రాష్ట్రానికి మైలురాళ్లని చంద్రబాబు అభివర్ణించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ రెండు కీలక సాగునీటి ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చడం సంతోషంగా ఉందన్నారు. వీటి ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని తెలిపారు.ఈ ప్రాజెక్టులు రైతులకు ఆశను కల్పించడంతో పాటు వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తాయని సీఎం పేర్కొన్నారు. అలాగే తాగునీటి భద్రతకు శాశ్వత ఆస్తులుగా నిలిచిపోతాయని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని టీచర్లకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పాఠ్యాంశాలతో పాటు విలువలు, క్రమశిక్షణను బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఆదర్శ జీవితాన్ని గడిపిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కాగా ఆగస్టు 31వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. సెప్టెంబర్ 2వ తేదీన అనకాపల్లి జిల్లాకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీళ్లు వదలిలారు. రెండు రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలడంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.


