CM Chandrababu: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఉపాధ్యాయులను పూర్తిగా రీప్లేస్ చేయలేమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన.. విద్యా వ్యవస్థ, ఉపాధ్యాయుల బాధ్యతలు, విద్యార్థుల భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నిర్వహించి మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. టీచర్లు గౌరవంగా జీవించాలంటే రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వ్యవస్థను రూపొందించాలని అన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులకు సహాయపడేందుకు ఏఐ ఆధారిత టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని సీఎం చెప్పారు. అయితే ఏఐ టీచర్ల స్థానాన్ని భర్తీ చేయదని స్పష్టం చేశారు. సాంకేతికత వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
సోషల్ మీడియా పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చంద్రబాబు అన్నారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. కుటుంబ విలువలు, నైతిక ప్రవర్తన పెంపుపై దృష్టి పెట్టాలని కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ నిత్య విద్యార్థులుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. తాను చదువుకునే రోజుల్లో భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడి చేతిలో దెబ్బలు తిన్నానని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్న వారు కూడా దెబ్బలు తిన్నవాళ్లేనని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం విద్యార్థులు మరి సున్నితంగా తయారయ్యారని వెల్లడించారు.


