Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ శాసనసభ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. నర్సీపట్నంలో తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
తనకు 70 ఏళ్ల వయసు వచ్చిందని, ఇకపై రాజకీయాల్లో చురుగ్గా తిరగడం సాధ్యం కాదని అయ్యన్నపాత్రుడు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయనని స్పష్టం చేశారు. వయసు పెరిగిన నేపథ్యంలో ఇక విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే తన ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉందని, ఈ సమయంలో నర్సీపట్నం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.
కాగా, అయ్యన్నపాత్రుడు ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. రాజకీయ ప్రస్థానంలో టీడీపీలోనే కొనసాగుతున్నారు. స్పీకర్‌గా కూడా ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


