BRS Leaders Arrest: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly ) సమావేశాల సందర్భంగా అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై నిరసనగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు, నల్ల చొక్కాలు ధరించి గన్‌పార్క్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు(Harish Rao), కేటీఆర్(KTR), జగదీశ్ రెడ్డి సహా పలువురు నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన తోపులాటలో హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలు కిందపడిపోయారు. అనంతరం హరీశ్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేసే సమయంలో ఆయనకు గాయాలయ్యాయని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.

అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు తమతో అమానుషంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు, భౌతిక దాడులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకోవడం అప్రజాస్వామికమని హరీశ్ రావు విమర్శించారు.మరోవైపు ప్రజల భూములను షేధిత జాబితా 22A లో చేర్చడంపై సభలో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.


