Apple CEO: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి సమర్పించిన నివేదికలో యాపిల్ సంస్థ వెల్లడించింది. దాదాపు 15 ఏళ్లుగా యాపిల్ సీఈఓగా కొనసాగిన టిమ్ కుక్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరి వేతన ప్యాకేజీల వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది.
యాపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్‌కు వార్షికంగా 58 మిలియన్ డాలర్ల పరిహార ప్యాకేజీని కంపెనీ ఖరారు చేసింది. అంటే భారత కరెన్సీలో ఇది సుమారు రూ.515 కోట్లు. సగటున నెలకు రూ.45 కోట్లకు పైగా వేతనం ఆయనఅందుకోనున్నారు. ఇందులో ఏడాదికి 3 మిలియన్ డాలర్ల(రూ.26.6కోట్లు) బేసిక్ శాలరీ ఉండగా.. సుమారు 55 మిలియన్ డాలర్ల(రూ.488 కోట్లు) విలువైన స్టాక్ అవార్డులు లభించనున్నాయి.ఈ స్టాక్ అవార్డుల్లో 75 శాతం కంపెనీ పనితీరు ఆధారంగా, మిగిలిన 25 శాతం నాలుగేళ్ల కాలవ్యవధిలో టైమ్ బేస్డ్గా అందుతాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి అదనంగా 2.5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డును కూడా టెర్నస్ అందుకోనున్నారు.
ఇక 15 ఏళ్ల పాటు యాపిల్ సీఈఓగా వ్యవహరించిన టిమ్ కుక్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ఈ హోదాలో ఆయనకు వార్షికంగా 47 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.417 కోట్లు పరిహారంగా లభించనుంది. ఇందులో 2 మిలియన్ డాలర్లు(రూ.17.7 కోట్లు) బేసిక్ శాలరీ కాగా.. 45 మిలియన్ డాలర్ల(రూ.399 కోట్లు) విలువైన స్టాక్ అవార్డులు ఉన్నాయి. ఈ స్టాక్‌లో 50 శాతం పనితీరు ఆధారంగా, మరో 50 శాతం టైమ్ బేస్డ్గా లభించనున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమితులైన టిమ్ కుక్ యాపిల్‌కు సంబంధించిన అమెరికా, చైనా ప్రభుత్వాలతో అంతర్జాతీయ దౌత్య సంబంధాలను పర్యవేక్షించనున్నారు.
టిమ్ కుక్ 1998లో యాపిల్ సంస్థలో చేరారు. 2011లో స్టీవ్ జాబ్స్ నుంచి సీఈఓ బాధ్యతలు స్వీకరించిన ఆయన దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను నడిపించారు. మొబైల్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాకుండా యాపిల్‌ను వివిధ ఉత్పత్తులు, సేవలు, వ్యాపార రంగాల్లో విస్తరించడంలో కుక్ కీలక పాత్ర పోషించారు. తన వారసుడిగా జాన్ టెర్నస్‌ను ఎంపిక చేయడం ద్వారా యాపిల్ తదుపరి దశ నాయకత్వానికి కూడా ఆయన మార్గం సుగమం చేశారు.ఇక కొత్త సీఈఓగా ఎంపికైన జాన్ టెర్నస్ నాయకత్వంలో యాపిల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, సంస్థను ఏ దిశగా తీసుకెళ్తారో టెక్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.


