Konda Surekha: తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టుపై మాజీ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆ పోస్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలో ‘‘త్వరలో బిగ్ అప్‌డేట్ ఉంటుంది.. వెయిట్ ఈజ్ ఆల్‌మోస్ట్ ఓవర్’’ అంటూ ఓ పోస్టు ప్రత్యక్షమైంది. దీంతో ఆమె నుంచి త్వరలో కీలక ప్రకటన వెలువడనుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది.
ఈ ప్రచారంపై కొండా సురేఖ స్పందిస్తూ.. తన పేరుతో వివిధ సోషల్ మీడియా వేదికల్లో ప్రసారం అవుతున్న పోస్టులకు తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. అధికారికంగా నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఖాతాల్లో వెలువడే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని మీడియా ప్రతినిధులు, ప్రజలను కోరారు. తన పేరుతో నకిలీ లేదా అనధికారిక ఖాతాల ద్వారా వస్తున్న పోస్టులను నమ్మవద్దని ఆమె సూచించారు.
మరోవైపు తన తల్లిని బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తల్లిదండ్రులను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. జాతీయ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సుస్మిత పటేల్ మాట్లాడుతూ.. తన తల్లిని కేబినెట్ నుంచి తొలగించడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. తల్లి కోసం తాను ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవేనని, తాను కాంగ్రెస్ పార్టీలో లేనని స్పష్టం చేశారు. తన తల్లి కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. తాను చేసిన వ్యాఖ్యలకు ఆమెను బాధ్యురాలిని చేయకూడదని అన్నారు. తాను మాట్లాడిన విషయాలకు తన తల్లితో ఎలాంటి సంబంధం లేదని సుస్మిత పేర్కొన్నారు.
ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనను ‘షార్ట్‌కట్ సీఎం’గా అభివర్ణించారు. తన తల్లి కొండా సురేఖ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ప్రజలతో ఉంటూ నిజాయితీగా పనిచేశారని సుస్మిత పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు తన తల్లిని బాధ్యురాలిని చేయడం ఎందుకని ప్రశ్నించారు. తన తల్లి విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండబోనని సుస్మిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయనను శపిస్తున్నానని పేర్కొన్నారు. తన తల్లి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు.


