KAKINADA
వేతనాలను పెంచాలని కాకినాడలో అంగన్వాడీల ధర్నా
తెల్లవారుజాము నిద్రలో ఉన్న అంగన్వాడీ నాయకుల అరెస్టు
చర్చలకు పిలిచి అరెస్టు చేయడం సిగ్గుచేటు అంటున్న అంగన్వాడీలు
ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కుటమి ప్రభుత్వంపై మండిపడుతున్న అంగన్వాడీలు
తూర్పు తీర ఆర్థిక ద్వారంగా వెలసిన కాకినాడ జిల్లా సముద్ర వాణిజ్యానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. చమురు, గ్యాస్ వనరులు, పోర్ట్ అభివృద్ధి, సాంస్కృతిక సంపదలతో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. కాకినాడలో వేతనాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. వారి శాంతియుత ఆందోళనపై కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. తెల్లవారుజాము నిద్రలో ఉన్న అంగన్వాడీ నాయకులను అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కచేరిపేట సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లాకుల వద్ద రహదారి దిగ్గ్బంధనం చేసి నిరసన తెలియజేశారు. శాంతియుత ఆందోళన చేస్తున్న చేస్తున్న అంగన్వాడీలను చర్చలకు పిలిచి అర్ధాంతరంగా తెల్లవారుజామున అరెస్టులు చేయడాన్ని.. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి ఖండించారు. ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని చెప్పిన చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. 2019 నుండి వేతనాలు పెంచలేదని, ఈ ఏడేళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం అంగన్వాడీలకు 26 వేలు చెల్లించేంత వరకు పోరాటాన్ని ఆపేదే లేదని హెచ్చరించారు. అంగన్వాడీ మహిళలపై దుశ్శాసనుడిలా విరుచుకుపడి బస్సులలో వందల కిలోమీటర్లు తిప్పుతూ, కనీసం కాలకృత్యాలు కూడా అవకాశం ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన అంగన్వాడీ నేతలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిరసనకు ఐద్వా రాష్ట్ర నాయకురాలు సిహెచ్ రమణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుముడి ఈశ్వరరావు, రిటైరు పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ అందిస్తారు.


