KONASEEMA
చంద్రగ్రహణం నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు మూసివేత
గ్రహణ సమయాల్లో ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి ఆలయాలు మూసివేత
గ్రహణం అనంతరం ఇవాళ ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం
సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుంచి దైవ దర్శనాలు పునఃప్రారంభం
గోదావరి నదీతీర సోయగాలతో తూర్పు గోదావరి డెల్టా హృదయంగా వెలసిన కోనసీమ జిల్లా, కొబ్బరి తోటలు, పచ్చని సాగుభూములతో ఆంధ్రప్రదేశ్ ఆభరణంగా నిలుస్తోంది. సాంప్రదాయ సంస్కృతి, దేవాలయ వైభవం, ప్రకృతి అందాలతో కోనసీమకు ప్రత్యేక ప్రతిష్ట ఏర్పడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు అన్నింటిని మూసివేశారు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసారు. అలాగే జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మురమళ్ళలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అమలాపురంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయం, అయినవిల్లిలోని విఘ్నేశ్వరస్వామి ఆలయం, అప్పనపల్లిలోని శ్రీ బాలబాలాజీ ఆలయం, మందపల్లిలోని శనీశ్వరస్వామి ఆలయం, ర్యాలిలోని శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం మూసివేయబడ్డాయి. గ్రహణ సమయాల్లో ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి ఆలయ కార్యక్రమాలు నిలిపివేయబడినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం ఇవాళ ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు ఆయా ఆలయాలలో దైవ దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి.


