SRIKAKULAM
శ్రీకాకుళం జిల్లా
ఉత్తరాంధ్ర వ్యవసాయ–మత్స్యకార రంగానికి కేంద్రంగా శ్రీకాకుళం జిల్లా నిలుస్తోంది. వలస ఉపాధి సమస్యలు కూడా ఇక్కడ ప్రధానాంశం. ఇప్పుడు తాజా వార్త.
శ్రీకాకుళంలో 2014లో విధ్వంసం సృష్టించిన హుద్ హుద్ తుఫాన్
నిరాశ్రయులైన బాధితులకు పక్కా ఇల్లు నిర్మాణం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం
10 ఏళ్లు దాటినా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించని అధికారులు
నిధుల కొరతతో మరమ్మత్తులు చేపట్టలేకపోయామని వెల్లడి
2014 అక్టోబర్ లో శ్రీకాకుళం జిల్లాలో హుద్ హుద్ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. రోడ్డున పడిన బాధితులను ఆదుకునేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ముందుకు వచ్చి నిరాశ్రయులైన వారికి పక్కా ఇల్లు నిర్మాణం చేపట్టింది. అయితే హుద్ హుద్ తుఫాన్ ధాటికి సర్వం కోల్పోయిన బాధితులకు అధికారులు, పాలకులు నేటికీ సొంత ఇల్లును అందించలేకపోయారు. 10 ఏళ్లు దాటినా ఇళ్ల కోసం లబ్ధిదారులు నీరిక్షిస్తూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కేటాయించినా మౌలిక వసతులు లేకపోవడంతో గృహప్రవేశాలు చేసిన వారు ఉండలేక.. వదులుకోలేక సతమతమవుతున్నారు. కవిటిలో 64, బెండి, పలాస, టెక్కలి, కోటబొమ్మాళిలో 192 చొప్పున, సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం వద్ద 174 ఇళ్లు మంజూరు చేసింది.
ఒక్కో ఇంటి నిర్మాణానికి 3లక్షల 98 వేల రూపాయలు, మౌలిక వసతుల కల్పనకు 80 వేల రూపాయలు కేటాయించింది. అంతేకాకుండా శరవేగంగా పనులు కూడా చేపట్టింది. ఇంతలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు గాలికొదిలేసింది. ఇల్లు నిర్మించి పదేళ్లు దాటడంతో పనికిరాని మొక్కలు పెరిగిపోయాయి. పూర్తిగా పర్యవేక్షణ లేకపోవడంతో కిటికీలకు ఉన్న ఇనుప గ్రిల్స్, తలుపులు, విద్యుత్తు సామగ్రి చోరీకి గురయ్యాయి. వీటికి మరమ్మతులు జరిపించేందుకు అధికారులు 9.05 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి అందించి ఏడాది దాటినా ఫలితం లేదు.
టెక్కలిలో 92 గృహాలను 2023లో వైసీపీ హయాంలో లబ్దిదారులకు కొన్ని ఇళ్లు అందజేసినప్పటికీ ఎటువంటి మౌలిక వసతులు కల్పించలేదు. నిధులు కొరతతో హుద్‌హుద్ ఇళ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పించలేకపోతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేయించి.. లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడతామని గృహ నిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు.
