Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న ఆందోళనలు కొంత తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం కనిపించింది. దాని ప్రభావంతో భారత మార్కెట్లు కూడా లాభాల్లోకి వచ్చాయి. దీంతో వరుసగా నాలుగు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు బ్రేక్ పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ముగింపు 76,152.86తో పోలిస్తే శుక్రవారం 76,657.02 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగిన సూచీ.. ఇంట్రాడేలో 76,883.14 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 362.57 పాయింట్లు, అంటే 0.48 శాతం లాభంతో 76,515.43 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా స్వల్ప లాభాలను నమోదు చేసింది. 24.25 పాయింట్లు, 0.10 శాతం పెరిగి 23,897.70 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 24,005.75 పాయింట్ల వరకు ఎగబాకింది.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్ సూచీ ఒక శాతానికి పైగా లాభపడి అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకింగ్ మినహా ఆర్థిక సేవల రంగంలోని షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. విస్తృత మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్మాల్‌క్యాప్ సూచీలు కొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. మరోవైపు ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ 0.47 శాతం, ఫార్మా 0.68 శాతం, హెల్త్‌కేర్ 0.87 శాతం చొప్పున క్షీణించాయి. మార్కెట్లో ఒడుదొడుకులను సూచించే ఇండియా వీఐఎక్స్ 6.24 శాతం తగ్గి 10.63 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు నష్టాలను చవిచూశాయి.అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై ఆందోళనలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతిచ్చినప్పటికీ.. కీలక స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ జోరును కొంత పరిమితం చేశాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా బలపడింది. 0.09 శాతం పుంజుకుని డాలర్‌కు రూ.94.48 వద్ద ట్రేడైంది. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లలోకి కొత్తగా నిధులు రావడం డాలర్ లిక్విడిటీకి మద్దతిచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 95.22 డాలర్ల వద్ద కొనసాగగా.. బంగారం ఔన్సు 4,472 డాలర్ల వద్ద ట్రేడైంది. బలమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, దేశీయ డిమాండ్ వంటి అంశాలు మదుపర్ల విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


