Vangaveeti Radha: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కుమార్తె పాస్‌పోర్ట్ దరఖాస్తు వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. పాస్‌పోర్ట్ కోసం సంప్రదించిన ఓ ఏజెన్సీకి చెందిన వ్యక్తి ఫోన్లో తనను దుర్భాషలాడడంతో పాటు బెదిరించాడని ఆరోపిస్తూ రాధాకృష్ణ విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాధాకృష్ణ కుటుంబం కుమార్తెకు మైనర్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీని ఫోన్ ద్వారా సంప్రదించారు. దరఖాస్తు ప్రక్రియపై వివరాలు అడగ్గా.. పాస్‌పోర్ట్ ఇప్పించేందుకు రూ.35 వేల వరకు ఖర్చవుతుందని ఏజెన్సీ ప్రతినిధి చెప్పినట్లు సమాచారం. దీనిపై రాధాకృష్ణ ప్రశ్నించడంతో సదరు వ్యక్తి ఫోన్లో దుర్భాషలాడినట్లు, పాస్‌పోర్ట్ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సదరు ఏజెన్సీ ప్రతినిధి పేరు మొయినుద్దీన్‌గా, హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ ఏజెన్సీ నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
కాగా, వంగవీటి రాధాకృష్ణకు 2023లో నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె పుష్పవల్లితో వివాహమైంది. ఈ దంపతులకు గతేడాది కుమార్తె జన్మించగా రుధిర అని పేరు పెట్టారు. పుష్పవల్లి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తల్లి జక్కం అమ్మాణి గతంలో నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె తండ్రి జక్కం బాబ్జి టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. ప్రస్తుతం వీరు జనసేనలో కొనసాగుతున్నారు.

