అల్లూరి: గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అరకు మండలం గన్నెలలో నిర్వహించిన కార్యక్రమంలో ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని ఆరోగ్య సంరక్షణకు అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించి ‘సంజీవని’ కార్యక్రమం గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చంద్రబాబు అన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు గిరిజనులు పాడేరు, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఈ ఇబ్బందులను తగ్గించేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నట్లు వెల్లడించారు. ‘మీ ఆరోగ్యం మీ ఫోన్లో ఉంది’ అని సీఎం పేర్కొన్నారు. సంజీవని యాప్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఫోన్లోనే తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
భవిష్యత్‌లో ఎక్కడికి వెళ్లినా తమ ఆరోగ్య చరిత్ర, అవసరమైన వైద్య సమాచారాన్ని ఫోన్ ద్వారా సులభంగా చెక్ చేసుకునేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతి గిరిజన కుటుంబానికి, ప్రతి గిరిజన బిడ్డకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆరోగ్య సమస్యకు పరిష్కార మార్గం చూపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం వెల్లడించారు. మూడు నెలల్లో ఏజెన్సీలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామని ప్రకటించారు. అవసరమైన వైద్య పరీక్షలను వీలైనంత వరకు పీహెచ్‌సీల్లోనే నిర్వహించేలా సదుపాయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కోసం గిరిజనులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. డిజిటల్ వైద్య సేవలు విజయవంతంగా అమలు కావాలంటే మొబైల్ కనెక్టివిటీ కీలకమని చంద్రబాబు అన్నారు.


