తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ పరువు పేరుతో ఓ మహిళను హత్య చేసేందుకు అన్నదమ్ములు పథకం పన్నినట్లు పోలీసులు తెలిపారు. దేవి ప్రసాద్ కొన్నేళ్లుగా ధన శాంతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై దేవి ప్రసాద్ కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా వారి సంబంధం కొనసాగింది. దీంతో మహిళను హతమార్చాలని దేవి ప్రసాద్, అతని అన్న అయ్యప్ప పథకం వేశారు. పుట్టినరోజు వేడుకల పేరుతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సుత్తితో తలపై దాడి చేశారు. ఆమె చనిపోయిందని భావించి గొయ్యిలో పడేసి పరారయ్యారు. మరుసటి రోజు స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


