Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ‘ఆదర్శ కుటుంబం’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంకటేష్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటైన ‘కూలీ నెం.1’లోని సూపర్‌హిట్ పాట ‘దండాలయ్య ఉండ్రాలయ్య’ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.‘కూలీ నెం.1’లో వెంకటేష్‌పై చిత్రీకరించిన ఈ పాట అప్పట్లో ఎంతటి క్రేజ్‌ను సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ముఖ్యంగా వినాయక చవితి వేడుకల్లో, గణేష్ మండపాల వద్ద ఈ పాట తరచూ వినిపిస్తూనే ఉంటుంది. తరతరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ పాటకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఇప్పుడు అదే పాటను వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ కోసం కొత్తగా రీమిక్స్ చేయనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. పాత పాటలోని ఒరిజినల్ ఫీల్‌ను కొనసాగిస్తూనే.. కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరికొత్త మ్యూజిక్, గ్రాండ్ విజువల్స్‌తో ఈ పాటను రూపొందించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ పాటను సినిమాలో ఏ సందర్భంలో ఉపయోగించబోతున్నారు? వెంకటేష్‌తో ఈ సాంగ్‌ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్రివిక్రమ్ తనదైన టేకింగ్‌తో ఈ పాటకు కొత్త రూపాన్ని ఇస్తే థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే సినిమాలో ఈ తరహా మాస్ సాంగ్ ఉంటే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ దక్కుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ‘దండాలయ్య ఉండ్రాలయ్య’ రీమిక్స్‌పై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ సాంగ్ నిజంగానే సినిమాలో భాగమైతే.. వెంకటేష్ అభిమానులకు ఇది స్పెషల్ ట్రీట్‌గా మారే అవకాశం ఉంది.

