AP Employees: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపే దిశగా సీఎం చంద్రబాబు(CM ChandraBabu) పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పీఆర్సీ, డీఏలు, పెన్షన్లు, సరెండర్ లీవ్ బకాయిలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
12వ వేతన సవరణ కమిషన్ (PRC) ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రెండు విడతల డీఏలను విడుదల చేయాలని నిర్ణయించారు. 2024 జూలై 1, 2025 జనవరి 1 నుంచి అమలుకావాల్సిన ఈ రెండు డీఏలను 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించనున్నారు. 2022కు సంబంధించిన సరెండర్ లీవ్ బకాయిలను వచ్చే సంక్రాంతి నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పోలీసులకు అదనంగా ఒక సరెండర్ లీవ్‌ను ఈ దసరా నుంచే అందించనున్నారు.
పెన్షనర్లకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027 జనవరి నుంచి 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ అమలు చేయనున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)ను మరింత పటిష్టం చేసి, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు ప్రతి నెలా నిధులు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి సుమారు రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుంది. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు.


