CSK Captanicy: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)లో కెప్టెన్సీ మార్పుపై ఆసక్తికర చర్చ మొదలైంది. వరుసగా మూడు ఐపీఎల్ సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోవడంతో జట్టు నాయకత్వంలో మార్పు అవసరమని మాజీ భారత క్రికెటర్ సదగోపన్ రమేశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో సంజూ శాంసన్‌ను( Sanju Samson) నాయకుడిగా ఎంపిక చేయాలని సూచించారు.
సంజూ శాంసన్ మంచి టీమ్ ప్లేయర్ అని, కెప్టెన్‌గా అతడికి అనుభవం కూడా ఉందని రమేశ్ పేర్కొన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 66 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన సంజూ.. 33 మ్యాచ్‌ల్లో తన జట్టును విజయపథంలో నడిపించాడని గుర్తుచేశారు. అతడి కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ ఒకసారి ఫైనల్‌కు, మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే సంజూను కెప్టెన్‌గా నియమించినంత మాత్రాన సీఎస్కే సమస్యలన్నీ పరిష్కారం కావని రమేశ్ స్పష్టం చేశారు. జట్టు కూర్పులోనూ కీలక మార్పులు అవసరమని పేర్కొన్నారు.
మరోవైపు 2026 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ 337 పరుగులు మాత్రమే చేశాడు. అతడి సగటు 28గా ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తే రుతురాజ్ బ్యాటర్‌గా మరింత స్వేచ్ఛగా రాణించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు. దీంతో సీఎస్కే తదుపరి సీజన్‌లో నాయకత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.


