Konda Surekha: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నేతలు హస్తిన బాట పట్టారు. గీత దాటుతున్న నాయకులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన మంత్రి కొండా సురేఖ మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు.
బహిరంగ సభల్లో ఎవరిని అడిగి, ఏ హక్కుతో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు ప్రకటిస్తున్నారని ఆమె నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే విషయాన్ని సీఎం ఒక్కరే ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. అలాగే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పుకోవడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు రాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తనను రాజీనామా చేయమని ఎవరూ కోరలేదని.. అయితే తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే ఆలోచన చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
తాను బీసీ వర్గానికి చెందిన సీనియర్ మహిళా నాయకురాలిని కావడం వల్లే కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో బీసీలకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా? అంటూ ఆమె ప్రశ్నించారు. బీసీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని మండిపడ్డారు. తనపై చర్యలు తీసుకునే ముందు పార్టీలో, ప్రభుత్వంలో మరికొందరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సురేఖ వ్యాఖ్యానించారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులపై పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. వాటిపై ఏం చర్యలు తీసుకుంటారన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలతో పాటు తన అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్ఠానానికి రాతపూర్వకంగా తెలియజేసినట్లు కొండా సురేఖ స్పష్టం చేశారు.
తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల వివాదంపై కొండా సురేఖ స్పందించారు. తన కూతురు మాట్లాడిన విషయాలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలకు మంత్రిని బాధ్యురాలిగా చేయడం ఏ విధమైన న్యాయమని నిలదీశారు. మహిళలు స్వతంత్రంగా ఎదగాలని, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా..? తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


