Konda Susmitha Patel: కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో.. ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తల్లిదండ్రులను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. జాతీయ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సుస్మిత పటేల్ మాట్లాడుతూ.. తన తల్లిని కేబినెట్ నుంచి తొలగించడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. తల్లి కోసం తాను ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవేనని, తాను కాంగ్రెస్ పార్టీలో లేనని స్పష్టం చేశారు. తన తల్లి కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. తాను చేసిన వ్యాఖ్యలకు ఆమెను బాధ్యురాలిని చేయకూడదని అన్నారు. తాను మాట్లాడిన విషయాలకు తన తల్లితో ఎలాంటి సంబంధం లేదని సుస్మిత పేర్కొన్నారు.
ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనను ‘షార్ట్‌కట్ సీఎం’గా అభివర్ణించారు. తన తల్లి కొండా సురేఖ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ప్రజలతో ఉంటూ నిజాయితీగా పనిచేశారని సుస్మిత పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు తన తల్లిని బాధ్యురాలిని చేయడం ఎందుకని ప్రశ్నించారు. తన తల్లి విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండబోనని సుస్మిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయనను శపిస్తున్నానని పేర్కొన్నారు. తన తల్లి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు.
అలాగే రాజకీయాల్లో ఎవరికి ఏ పదవిని ఇస్తారనే విషయంపై నేతలు చేస్తున్న ప్రకటనలపైనా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. పరకాలకు వెళ్లి రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్ ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన చేయడానికి ఉన్న అధికారంపై ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సుస్మిత పలువురు కాంగ్రెస్ నేతలపై కూడా ఆరోపణలు చేశారు. వేం నరేందర్‌రెడ్డి వరంగల్ రాజకీయాల్లో ఆధిపత్యం సాధించాలని ప్రయత్నిస్తున్నారని, కొండా కుటుంబం ఉంటే అది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే తన తల్లిని పక్కన పెట్టారని ఆరోపించారు. అలాగే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. తన తల్లి ప్రమేయం లేకుండానే ఆమె పరిధిలోని శాఖకు సంబంధించిన కాంట్రాక్టులను ఇతర శాఖకు తీసుకెళ్లారని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో తన తల్లిని టార్గెట్ చేసిన వారిని వదిలిపెట్టబోనని సుస్మిత స్పష్టం చేశారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపిస్తానని తెలిపారు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డిలు ఏమి చేస్తున్నారనే దానిపై సీబీఐ, ఈడీలకు లేఖలు రాస్తానని పేర్కొన్నారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఈడీ, సీబీఐలకు పంపిస్తాను అని సుస్మిత హెచ్చరించారు. సుస్మిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


