మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలకు ముందే అయ్యప్ప స్వామి మాలలో రవితేజ కనిపించడం.. టీజర్, ట్రైలర్‌లో కనిపించిన ఇంటెన్స్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దాంతో ఇటీవల రవితేజ సినిమాలకు కనిపించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదయ్యాయి. ఇక అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి వస్తున్న సోషల్ మీడియా స్పందనను బట్టి ‘ఇరుముడి’కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు సినిమా మరో కోణాన్ని పరిచయం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీజర్, ట్రైలర్ చూసినప్పుడు భక్తి.. ఫ్యామిలీ ఎమోషన్.. తండ్రి కూతురు అనుబంధం.. ఇవే సినిమాలో ప్రధానంగా ఉంటాయని అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత అసలు ‘ఇరుముడి’ కేవలం ఒక ఫ్యామిలీ డ్రామా కాదని ప్రేక్షకులు చెబుతున్నారు. కథలోని ప్రధాన అంశాన్ని పక్కదారి పట్టించకుండా శివ నిర్వాణ నిజాయితీగా తెరకెక్కించారని ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఈ సినిమా ఆలోచింపజేస్తుందని అంటున్నారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల ఆలోచనా విధానం ఎలా ఉండాలి.. పేరెంటింగ్ స్టైల్ పిల్లల జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశాలను కథలో టచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడే ‘ఇరుముడి’ సాధారణ ఫ్యామిలీ కథ నుంచి మరో స్థాయికి వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది.
అయితే ప్రమోషనల్ కంటెంట్‌లో తండ్రి కూతురు బంధాన్నే ఎక్కువగా చూపించారు. కానీ సినిమాలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కూడా కీలకంగా ఉంటుందని ప్రీమియర్ టాక్ చెబుతోంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తున్నాయని అంటున్నారు సినీ ప్రేక్షకులు. తండ్రీ కొడుకుల మధ్య బంధం.. అమ్మాయిల పెంపకం విషయంలో సాయి కుమార్ చెప్పే డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. కథలో సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌ను కూడా కలిపారు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు.. థ్రిల్లింగ్ మూమెంట్స్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇలా ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌గా నడిపించారని టాక్ వస్తోంది. ఇక శివ నిర్వాణ అంటేనే భావోద్వేగాలను బలంగా చూపించే దర్శకుడిగా గుర్తింపు ఉంది. ఇప్పుడు ‘ఇరుముడి’లో కూడా అదే తనదైన శైలిని కొనసాగించారని ప్రీమియర్ టాక్ చెబుతోంది. రవితేజ ఎనర్జీకి భిన్నంగా ఒక ఎమోషనల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేయడం.. దానికి ఫ్యామిలీ, సోషల్ అంశాలను జోడించడం సినిమాకు కొత్తదనం తీసుకొచ్చిందనే అభిప్రాయం వినిపిస్తోంది.


