హైదరాబాద్: తెలంగాణలో సినిమా థియేటర్లలో టికెట్ ధరలు, షోల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చినట్లు సమాచారం. కొత్త మార్గదర్శకాలలో భాగంగా స్పెషల్ థియేటర్స్ అనే కొత్త కేటగిరీని ఏర్పాటు చేయనున్నారు. 7.1 సౌండ్ సిస్టమ్, 2K/4K స్క్రీన్లు వంటి అధునాతన సాంకేతిక సదుపాయాలు కలిగిన థియేటర్లను ఈ కేటగిరీలోకి తీసుకురానున్నారు. తెలంగాణలో సినిమా థియేటర్ల వర్గీకరణ, ప్రవేశ రేట్లకు సంబంధించిన ప్రస్తుత వ్యవస్థకు గతంలో G.O.Ms.No.120 ద్వారా నిబంధనలు జారీ అయ్యాయి. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీగా ఉంచాల్సి ఉంటుంది. అలాగే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు గరిష్ఠంగా ఐదు షోలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాలకు థియేటర్లలో ప్రదర్శన అవకాశాలు కల్పించేలా రోజుకు కనీసం ఒక షో తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కే చిత్రాలకు సూపర్ హైబడ్జెట్ సినిమా హోదా కల్పించనున్నారు. ఇలాంటి భారీ చిత్రాలకు తొలి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ తెలంగాణ ప్రభుత్వం భారీ చిత్రాలకు పరిమిత కాలానికి టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చింది.


